పుదుచ్చేరిలో వెలుగుచూసిన మరో బ్లూ వేల్ ఛాలెంజ్ బాదితురాలు

Blue Whale Challenge

బ్లూవేల్‌ ఛాలెంజ్ ఆటలో నిమగ్నమై పుదుచ్చేరి రాష్ట్రంలోని ఓ బ్యాంక్‌ ఉద్యోగిని ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నం చేశారు. మూడు రోజుల కిందట పుదుచ్చేరి వర్సిటీ విద్యార్థి శశిహందాబోరి బ్లూవేల్‌ క్రీడకు బలికావడంతో అప్రమత్తమైన పోలీసులు సోషల్‌ మీడియాలో ఈ క్రీడ పర్యవసానాన్ని ప్రస్తావిస్తూ అవగాహన కల్పించారు.

ఇదిలా ఉండగా పుదువై ఉప్పళంకు చెందిన బ్యాంకు ఉద్యోగిని ప్రియ (21) బ్లూవేల్‌ క్రీడలో తీవ్రంగా నిమగ్నమయ్యారు. శనివారం రాత్రి ఆమె తన కుటుంబీకులతో కలసి ఇంట్లో నిద్రించారు. తెల్లవారుజాము నాలుగు గంటల సమయంలో తన సహోద్యోగులకు ఫోన్‌చేశారు. అందులో ఫోన్‌ తీసిన ఒకరికి తాను ఎక్కడున్నానో తనకు తెలియడం లేదని కలత చెందారు. కొంతసేపటికి మళ్లీ ఫోన్‌చేసి తాను బీచ్‌లో ఉన్నానని, అక్కడ టీ తాగేందుకు రమ్మని ఆహ్వానించారు. ఆ తర్వాత ప్రియ మళ్లీ ఫోన్‌చేసి తాను ఇంట్లో ఉన్నట్లు తెలిపి ఫోన్‌ స్విచాఫ్‌ చేశారు.

ప్రియ బ్లూవేల్‌ క్రీడకు బానిస కావడం.. తద్వారా మతిస్థిమితం కోల్పోయినట్టు గ్రహించిన సహోద్యోగి వెంటనే మరో సహోద్యోగి అయిన గిరిధరన్‌కు సమాచారం అందించారు. ఆయన వెంటనే ఓదియంజాలై పోలీసులకు తెలిపారు. పోలీసులు ప్రియ ఇంటికి వెళ్లగా ఆమె అక్కడ కనిపించలేదు. వెంటనే ఆమె తల్లిదండ్రులను తీసుకుని బీచ్‌ రోడ్డుకు వెళ్లి ప్రియను గుర్తించారు. ప్రియ ఆత్మహత్య చేసుకునేందుకు అక్కడికి వచ్చినట్లు తెలుసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులను విచారిస్తున్నారు.

Add Comment