టెన్త్‌ విద్యార్థినిపై నలుగురు యువకుల లైంగికదాడి, హత్య

School Girl Gangraped

టెన్త్‌ విద్యార్థినిపై నలుగురు యువకులు లైంగికదాడి చేసి హత్య చేశారు. విజయ నగరం జిల్లా గాదెల వలసలో ఈ దారుణం జరిగింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. బొబ్బిలి మండలం రెడ్డియ్యవలస గ్రామానికి చెందిన మిరియాల ఇందు సీతానగరం మండలంలోని గాదెలవలసలో 10వ తరగతి చదువుతోంది. శుక్రవారం పాఠశాలకు వచ్చిన ఆమె మధ్యాహ్నం భోజనం చేసేందుకు సైకిల్‌పై ఇంటికివెళ్లింది. తిరిగి పాఠశాలకు వస్తుండగా మార్గంమధ్యలో గాదెలవలసలోని వైన్‌షాపు సమీపంలో పోతల శంకరరావు ఆమెను ఆపి భయపెట్టాడు.

గాదెలవలస, బడేవలస మధ్యన ఉన్న మామిడితోటలోకి బాలికను తీసుకెళ్లి సొంగల లోకేశ్, చుక్క రాంబాబు, కోదేటి రవితేజతో కలసి బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎక్కడ చెబుతుందోనని గొంతునులిమి హత్యచేసి.. మృతదేహాన్ని చెరువులో పడేసి వెళ్లిపోయారు. స్కూల్‌ నుంచి కుమార్తె ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు శ్రీనివాసరావు, సత్యవతి గాదెలవలస వచ్చి విచారించారు. ఇందుతో శంకరరావు మధ్యాహ్నం మాట్లాడినట్లు, ఇందును బెదిరించినట్లు ప్రత్యక్ష సాక్షి పి.అచ్చుత్ వారికి తెలిపారు. గ్రామ పెద్దలతో కలసి శంకరరావును నిలదీయగా.. జరిగిన విషయాన్ని శంకరరావు పెద్దల ముందు ఒప్పుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇందు మృతదేహాన్ని చెరువులోంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం బొబ్బిలి తరలించారు. నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

Add Comment